కేంద్ర హోం మంత్రిని కలిసిన నారా లోకేశ్

  • జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లానన్న లోకేశ్
  • చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తమను వేధిస్తున్నారని ఆవేదన
  • తన తల్లీ, భార్యను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
  • తమపై ఉన్న కేసుల వివరాలను షా అడిగి తెలుసుకున్నట్టు వెల్లడి
  • చంద్రబాబు ఆరోగ్యంపై వాకబు, రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తున్నానని షా అన్నారని వెల్లడి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కక్షసాధింపు చర్యలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు లోకేశ్ మీడియాకు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తమను వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు తీరును హోం మంత్రికి వివరించానని అన్నారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, తనపై ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి అమిత్ షా వాకబు చేశారని లోకేశ్ చెప్పారు. 

జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి హోంమంత్రికి వివరించానని లోకేశ్ తెలిపారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఈ సందర్భంగా అమిత్ షా అభిప్రాయపడ్డారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం గురించి కూడా షా అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తున్నానని షా అన్నారని లోకేశ్ వెల్లడించారు. కాగా, ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.


More Telugu News