సీఎం జగన్ చరిత్రతో తెరకెక్కిన 'వ్యూహం', 'శపథం' చిత్రాల రిలీజ్ డేట్లను ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

  • వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వర్మ చిత్రాలు
  • కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ సీఎంగా జగన్ గెలవడాన్ని తెరకెక్కించిన వర్మ
  • జగన్, భారతి పాత్రలను పోషించిన అజ్మల్, మానస
ఏపీలో రాజకీయాలు ఇప్పటికే సెగలు పుట్టిస్తున్నాయి. మరోవైపు సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా మరింత వేడి పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన వైసీపీకి అనుకూలంగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. వ్యూహం, వ్యూహం-2 (శపథం) పేర్లతో రెండు పార్టులుగా ఈ చిత్రాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాల పోస్టర్లు, టీజర్లు సంచలనం రేపాయి. వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిస్థితులు, జగన్ పై కేసులను 'వ్యూహం'లో, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రిగా విజయం సాధించడాన్ని 'శపథం'లో వర్మ చూపించబోతున్నారు. 

ఈ సినిమాల్లో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస నటించారు. దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. కాసేపటి క్రితం ఈ సినిమాల విడుదల తేదీలను రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా ప్రకటించారు. 'వ్యూహం' చిత్రాన్ని నవంబర్ 10న, 'శపథం' చిత్రాన్ని జనవరి 25న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించేలా గతంలో కూడా రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


More Telugu News