అమెజాన్ ప్రైమ్ కి వచ్చేస్తున్న 'మార్క్ ఆంటోని'
- 'మార్క్ ఆంటోని'గా వచ్చిన విశాల్
- 1975- 95 మధ్యలో నడిచే కథ
- హీరో - విలన్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా
- ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్
విశాల్ హీరోగా కొన్ని రోజుల క్రితమే 'మార్క్ ఆంటోని' సినిమా థియేటర్లకు వచ్చింది. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య నటించాడు. సునీల్ .. సెల్వ రాఘవన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ నెల 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. తెలుగులో అంతగా ఆకట్టుకోని ఈ సినిమా, తమిళంలో మాత్రం భారీ వసూళ్లనే రాబట్టింది. అక్కడ విశాల్ కి ఉన్న ఇమేజ్ .. మార్కెట్ అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
ఈ సినిమాలో చాలానే విశేషాలు కనిపిస్తాయి. ఈ కథ 1975 నుంచి 95కి మధ్యలో నడుస్తుంది. ఆ కాలం నాటి వాతావరణం కొత్తగా అనిపిస్తుంది. హీరోగా విశాల్ ద్విపాత్రాభినయంతో కనిపిస్తాడు. ఇక విలన్ గా ఎస్.జె. సూర్య కూడా ద్విపాత్రాభినయంతో కనిపిస్తాడు. ఇద్దరి మధ్య టైమ్ మెషిన్ అనే ఓ అంశం ఉంటుంది. దాని చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.