ప్రజాధనాన్ని లాయర్లకిచ్చి చంద్రబాబును ఇంకా జైల్లో ఉంచాలనుకుంటున్నారు: దేవినేని ఉమ

  • 151 సీట్లు వచ్చాయని మదం, లక్షల కోట్లు దోచుకున్నాననే అహంకారం ఉందన్న దేవినేని
  •  త్వరలో నిన్ను ప్రజలు గద్దె దించుతారన్న మాజీ మంత్రి
  • ప్రధాని మోదీ అపాయింటుమెంట్ కోసం జగన్ పడిగాపులు కాశాడని విమర్శ
గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని మదం, రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నాననే అహంకారం కలగలిపి జగన్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ మంగళవారం టీడీపీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైలవరం దీక్షా శిబిరంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... జగన్ రెడ్డీ, మిడిసిపడమాకు త్వరలో ప్రజలు నిన్ను ఓటు అనే ఆయుధంతో గద్దె దించుతారని మండిపడ్డారు.

ప్రజలు కట్టిన పన్నుల డబ్బులను లాయర్లకు ఇచ్చి చంద్రబాబును ఇంకా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి కాలం దగ్గర పడిందని ధ్వజమెత్తారు. అందుకే జగన్ మాటల్లో అహంకారం కనబడుతోందన్నారు. రాజ్యాంగాన్ని ఎంత మసిపూసి మారేడుకాయ చేసినప్పటికీ చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తాయన్నారు. ముందస్తు ఎన్నికల కోసం మూడ్రోజుల పాటు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం జగన్ పడిగాపులు కాశాడని విమర్శించారు.

రైతాంగం కోసం కృష్ణా జలాలపై ప్రధాని మోదీకి వినతిపత్రం కూడా ఇవ్వలేకపోయిన చేతగాని, అసమర్ధుడు మన ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జలాలపై జగన్ మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా నీటిని పక్క రాష్ట్రం తెలంగాణకు తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి జగన్ ఉరితాడు వేశాడన్నారు. ఇందుకు మన రైతాంగానికి జగన్ సమాధానం చెప్పాలన్నారు.


More Telugu News