దసరా పండుగకు తెలంగాణ ఆర్టీసీ లక్కీ డ్రా

  • తెలుగు రాష్ట్రాల్లో దసరా వేళ ఆర్టీసీ బస్సులకు గిరాకీ
  • మరింత ఆక్యుపెన్సీ కోసం తెలంగాణ ఆర్టీసీ వినూత్న పథకం
  • ప్రయాణికులకు లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయం
  • మొత్తం రూ.11 లక్షల నగదు బహుమతులు
దసరా సీజన్ వచ్చిందంటే ఆర్టీసీ బస్సులు కిటకిటలాడిపోతుంటాయి. దాంతో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు వందల సంఖ్యలో స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తుంటాయి. ఎక్కడెక్కడో స్థిరపడినవాళ్లు, వలస జీవులు విజయదశమి వేళ సొంతూర్లకు పయనమవుతుంటారు కాబట్టి భారీ రద్దీ తప్పదు. 

ఆదాయం భారీగా పెంచకునేందుకు ఈ పండుగ సీజన్ ఆర్టీసీలకు మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ప్రయాణికులను మరింతగా ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న చర్యలు తీసుకుంటోంది. దసరా సీజన్ లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించనుంది. 

ఈ లక్కీ డ్రా ఎలా ఉంటుందంటే... ఆర్టీసీ బస్సులో ఎక్కిన ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ పై తమ పూర్తి పేరు, ఫోన్ నెంబరు రాసి బస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాల్సి ఉంటుంది. 110 మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. 

ప్రతి రీజియన్ నుంచి 10 మందికి లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం ఉంటుంది. లక్కీ డ్రా కింద ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి రూ.9,900 చొప్పున బహుమతి లభిస్తుంది. 

అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు.... అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి ఈ లక్కీ డ్రా వర్తిస్తుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం  040-69440000, 040-23450033 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.


More Telugu News