వరల్డ్ కప్: ధర్మశాలలో బంగ్లాదేశ్ బౌలింగ్ ను ఊచకోత కోసిన ఇంగ్లండ్

  • నేడు వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ × బంగ్లాదేశ్
  • ధర్మశాలలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 364 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • ఓపెనర్ డేవిడ్ మలాన్ సూపర్ సెంచరీ
వరల్డ్ కప్ లో నేడు డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ధర్మశాలలో లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

కానీ బంగ్లాదేశ్ బౌలర్లకు పిచ్ పరిస్థితులు ఏమాత్రం సహకరించలేదు. ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాట్స్ మెన్ బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నారు. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 9 వికెట్లకు 364 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలాన్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మలాన్ 107 బంతుల్లో 140 పరుగులు చేయడం విశేషం. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ 16 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 

మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో 59 బంతుల్లో 8 ఫోర్లతో 52 పరుగులు చేయగా, ఇటీవల తన ఆటతీరులో దూకుడు పెంచిన స్టార్ ఆటగాడు జో రూట్ 68 బంతుల్లోనే 82 పరుగులు చేశాడు. రూట్ 8 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. కెప్టెన్ జోస్ బట్లర్ 10 బంతుల్లో 20, యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 15 బంతుల్లో 20 పరుగులు చేశారు. 

అయితే, లియామ్ లివింగ్ స్టోన్ (0) డకౌట్ కాగా, చివర్లో ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ మహెదీ హసన్ 4, మీడియం పేసర్ షోరిఫుల్ అస్లామ్ 3 వికెట్లు పడగొట్టారు. తస్కిన్ అహ్మద్ 1, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 1 వికెట్ తీశారు.


More Telugu News