బీసీల గొంతు నొక్కడమే జగన్ లక్ష్యమా? గాలి పీల్చుకోవాలన్నా జగన్ పర్మిషన్ కావాలంటారేమో!: అచ్చెన్నాయుడు

  • జగన్ బీసీల ద్రోహి అన్న అచ్చెన్నాయుడు
  • కాల్వ శ్రీనివాసులుపై వరుస కేసులు పెడుతున్నారని మండిపాటు
  • పోలీసులను జగన్ ప్రైవేట్ సైన్యంలా మార్చుకున్నారని విమర్శ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బీసీ ద్రోహి అంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బడుగు, బలహీనవర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ ను ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ తనలోని పెత్తందారీతనాన్ని మరొక సారి రుజువు చేసుకున్నారని చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు పెట్టడం హేయమని దుయ్యబట్టారు. అన్ని కేసుల్లోనూ కావాలనే మొదటి ముద్దాయిగా చేరుస్తున్నారని పోలీసులపై మండిపడ్డారు. 

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపైనే కేసులెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే ముందస్తు అరెస్ట్ లు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. 

చట్టాన్ని చుట్టంలా వాడుకుంటున్న జగన్... పోలీసులను వైసీపీకి ప్రైవేటు సైన్యంలా మార్చుకుని అరాచకానికి నాంది పలుకుతున్నారని అన్నారు. బీసీలు గాలి పీల్చాలన్నా జగన్ పర్మిషన్ కావాలని అంటారేమోనని మండిపడ్డారు. జగన్ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పలికే సమయం ఆసన్నమయిందని చెప్పారు. ఏపీ నీడ్స్ జగన్ అని కాకుండా... ఏపీ హేట్స్ జగన్ అంటూ ప్రజలు పిలుపునిస్తున్నారని అన్నారు. 



More Telugu News