తేనెలో కల్తీ ఉందా.. లేదా ఇలా తెలుసుకోవచ్చు!
- ఇంట్లోనే సులభంగా పరీక్షించే ఉపాయాలు
- గ్లాస్ నీటిలో చెంచాడు తేనె వేస్తే తెలుస్తుంది
- వేడి చేసి కూడా స్వచ్ఛత తెలుసుకోవచ్చు
- వెనిగర్, చివరికి కంటితో పరీక్షించి చూడొచ్చు
ప్రకృతిలో సహజంగా, స్వచ్ఛంగా లభించే తేనె, నేడు వాణిజ్య ఉత్పత్తిగా మారిపోయింది. చాలా కంపెనీలకు చెందిన తేనె మార్కెట్లో లభిస్తోంది. నూరు శాతం స్వచ్ఛమైన తేనె తమదేనంటూ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. కానీ, వినియోగదారుడిగా మనం కొనుగోలు చేసే తేనె ఎంత స్వచ్ఛమైనదో మనమే తెలుసుకోవాలి. ఇందు కోసం కొన్ని పద్ధతులు ఉన్నాయి. తాము కొనుగోలు చేసిన తేనెలో స్వచ్ఛత పాళ్లను ఈ విధంగా తెలుసుకోవచ్చు.
- ఒక గ్లాసు నీటిలో ఒక చెంచాడు తేనె వేయండి. తేనె స్వచ్ఛమైనదే అయితే వెంటనే నీటిలో కరిగిపోకుండా, నిదానంగా గ్లాస్ అడుగుకు చేరుకుంటుంది. అలా కాకుండా నీటిలో వేసిన తేనె కరిగి, చుట్టూ విస్తరించిందంటే అది కల్తీ అయినట్టు అర్థం చేసుకోవాలి. కల్తీ తేనెలో తేమ లేదంటే సిరప్ ఉండడం వల్లే నీటిలో కరిగి చెల్లాచెదురుగా విస్తరిస్తుంది.
- టిష్యూ పేపర్ తీసుకుని దానిపై ఒక చుక్క తేనె వేయాలి. తేనె స్వచ్ఛమైనదే అయితే వెంటనే పేపర్ పీల్చుకోలేదు. కొంత సమయం పడుతుంది. పైగా తేనె మరక కూడా కనిపించదు. అదే కల్తీ తేనె అయితే వెంటనే టిష్యూ పేపర్ గ్రహించేస్తుంది.
- కొంచెం తేనె తీసుకుని దాన్ని వేడి చేయాలి. స్వచ్ఛమైన తేనె బంగారం రంగులో కనిపిస్తూ, మంచి పరిమళం విడుదల అవుతుంది. కల్తీ తేనె అయితే వెంటనే మండడం లేదంటే కాలిన వాసన వస్తుంది.
- తేనె రంగును పరిశీలించడం మరో విధానం. స్వచ్ఛమైన తేనె అయితే, బంగారం రంగులో కనిపిస్తుంది. ఈ రంగులో కొంత వ్యత్యాసం కూడా ఉండొచ్చు. కల్తీ తేనె కొంచెం అధిక స్పష్టతతో, లేత రంగులో ఉంటుంది.
- సహజ తేనె అయితే కొంత కాలానికి స్ఫటికాలుగా మారుతుంది. ద్రవం నుంచి గట్టిపడుతుంది. మీరు కొనుగోలు చేసిన తేనె అస్సలు స్ఫటీకరణ చెందడం లేదంటే, ఎప్పుడూ ఒకే మాదిరిగా కనిపిస్తే అది కల్తీ అని అర్థం చేసుకోవచ్చు.
- స్వచ్ఛమైన తేనె పీహెచ్ తక్కువగా ఉంటుంది. అసిడిక్ స్వభావంతో ఉంటుంది. కనుక వెనిగర్ తో కలిపినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉండదు. కల్తీ చేస్తే, అది వెనిగర్ తో చర్యకు గురవుతుంది.