ఇక దేశంలో కొత్తగా సైబర్ కమాండోలు
- సైబర్ దాడులను ఎదుర్కొనే వ్యూహం
- సైబర్ నైపుణ్యాలపై శిక్షణ
- ప్రత్యేక విభాగంగా పని చేయనున్న కమాండోలు
సైబర్ దాడుల ముప్పు పెరిగిపోయిన నేపథ్యంలో దేశంలో కొత్తగా సైబర్ కమాండోస్ విభాగాన్ని కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా తదుపరి తరం సైబర్ దాడులకు సన్నద్ధంగా ఉండాలన్న యోచన కనిపిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు దళాలు, కేంద్ర పోలీసు బలగాల నుంచి చురుకైన వారిని నియమించుకుని, సైబర్ నైపుణ్యాలు, దాడుల విషయంలో వారిని సుశిక్షితులుగా కేంద్ర హోంశాఖ తీర్చిదిద్దనుంది.
అర్హులైన 10 మంది సైబర్ కమాండోలను గుర్తించాలంటూ కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ తాజాగా కోరింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన డీజీపీ/ఐజీల సదస్సులో ప్రధాని మోదీ సైబర్ కమాండోస్ ఏర్పాటు ప్రతిపాదన తీసుకొచ్చారు. అది ఇప్పటికి సాకార రూపం దాల్చబోతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న సైబర్ కమాండోస్ విభాగం.. సైబర్ దాడుల ముప్పును ఎదుర్కొంటుంది. ఐటీ నెట్ వర్క్ ను కాపాడుతుంది. సైబర్ విభాగాలకు సంబంధించి దర్యాప్తు వ్యవహారాలు చూస్తుంది. ఐటీ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ విభాగాల్లో సైబర్ కమాండోలు తగినంత పరిజ్ఞానం కలిగి ఉంటారు. ఇందుకు కావాల్సిన శిక్షణనిస్తారు. సైబర్ కమాండోస్ విభాగం పోలీసుల విభాగాల్లో అంతర్భాగంగా ఉండనుంది.