సెల్ఫీ తీసుకుంటూ గుట్టలపై నుంచి పడ్డ యువతి.. 12 గంటల పాటు ప్రత్యక్షనరకం

  • విశాఖనగర శివారులోని అప్పికొండ సాగర తీరంలో ఆదివారం ఘటన
  • యువకుడితో పాటూ ఫొటోలు దిగేందుకు గుట్టపైకి వెళ్లిన యువతి
  • ప్రమాదవశాత్తూ జారిపడటంతో కాలికి తీవ్ర గాయాలు
  • యువతి పరిస్థితి చూసి భయపడి పారిపోయిన యువకుడు
  • మరుసటి రోజు తెల్లారాక స్థానికులు యువతిని గుర్తించి ఆసుపత్రికి తరలించిన వైనం
యువకుడితో కలిసి గుట్టలపై సెల్ఫీ తీసుకుంటుండగా ఓ యువతి ప్రమాదవశాత్తూ పడిపోయింది. భయంతో ఆ యువకుడు పరారవడంతో ఆమెకు సాయం చేసేవారు లేక దాదాపు 12 గంటల పాటు నరకయాతన అనుభవించింది. విశాఖ నగర శివారులోని అప్పికొండ సాగర తీరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ యువతి (18) మరో యువకుడితో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. 

ఆదివారం సాయంత్రం ఆమె యువకుడితో కలిసి రాళ్ల గుట్టలపై ఫొటోలు తీసుకునేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ఆమె ఎత్తు ప్రదేశం నుంచి జారి పడింది. దీంతో, కంగారు పడిపోయిన యువకుడు ఆమెను అక్కడే వదిలేసి పారిపోయాడు. చుట్టూ చిమ్మచీకటి, జనసంచారం లేకపోవడంతో ఆమె రాత్రంతా నరకయాతన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడింది. సోమవారం బీచ్‌కు వచ్చిన కొందరు ఆమెను గుర్తించి గజఈతగాళ్ల సాయంతో ఆసుపత్రికి తరలించారు.  యువతికాళ్లకు తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. 

అయితే, తాను కాలుజారి పడిపోయానని, పరారీలో ఉన్న యువకుడిని ఏమీ అనొద్దని ఆమె చెప్పింది. మరోవైపు అంబులెన్స్ సిబ్బంది యువతి తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె విశాఖకు బయలుదేరారు. కుమార్తె కనబడకపోవడంతో అంతకుముందే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె పేర్కొంది. కాగా, పరారీలో ఉన్న యువకుడికి కూడా ప్రమాదం జరిగిందని, అతను కూడా ఆసుపత్రిలో ఉన్నట్టు సమాచారం.


More Telugu News