కాసేపట్లో సీఐడీ విచారణకు లోకేశ్.. టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
- రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్
- తాడేపల్లిలోని కార్యాలయంలో 10 గంటలకు విచారణ ప్రారంభం
- లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈరోజు సీఐడీ విచారణకు హాజరవుతున్నారు. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. కావాల్సిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం కోసం రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను ఉద్దేశపూర్వకంగా మార్చారనే అభియోగాలను ఈ కేసులోని నిందితులపై సీఐడీ మోపింది. ఈ కేసులో లోకేశ్ ఏ14గా ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద లోకేశ్ కు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేశ్ ను అరెస్ట్ చేయకూడదని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విచారణ సమయంలో లోకేశ్ తో పాటు ఆయన న్యాయవాదిని కూడా అనుమతించాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు, లోకేశ్ విచారణ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.