వచ్చే నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్లు దాఖలు చేయనున్న కేసీఆర్

  • కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్
  • ఆ తర్వాత గజ్వేల్‌లో మొదటి, కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు
  • ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం
  • 15 నుంచి వరుసగా బహిరంగ సభలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ వచ్చే నెల 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్‌లో కేసీఆర్ మొదటి నామినేషన్ వేసి, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ దాఖ‌లు చేస్తారు. అనంతరం మ‌ధ్యాహ్నం మూడు గంటల‌కు కామారెడ్డి బహిరంగసభలో పాల్గొంటారు.

సీఎం కేసీఆర్ ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందిస్తారు. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారు. నాటి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 15న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత 16న జనగామ, భువనగిరి కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్లలలో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం రెండు గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశంలో, సాయంత్రం నాలుగు గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరవుతారు.


More Telugu News