నిజ్జర్ హత్య వెనుక చైనా భారీ కుట్ర!
- భారత్, పాశ్చాత్య దేశాల బంధాన్ని దెబ్బతీసేలా అగ్గిరాజేసిన చైనా
- ‘ఇగ్నిషన్ ప్లాన్’ పేరిట భారీ కుట్రకు తెరలేపిన వైనం
- చైనా సీక్రెట్ ఏజెంట్ల చేతుల్లో నిజ్జర్ హత్య
- అంతకుమునుపు, అమెరికాలో చైనా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి సీక్రెట్ మీటింగ్
- అమెరికాలోని చైనా జర్నలిస్టు సంచలన ఆరోపణలు
నిజ్జర్ హత్యతో భారత్, కెనడా మధ్య అగ్గి రాజేసింది చైనాయేనని ఆ దేశానికి చెందని ఓ జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. భారత్, పాశ్చాత్యదేశాల బంధాన్ని దెబ్బతిసేందుకు ఇగ్నిషన్ ప్లాన్ పేరిట ఈ కుట్రకు తెరలేపిందని పేర్కొన్నారు. ఈ మేరకు చైనా రచయిత, యూట్యూబర్ లావో డెంగ్ చేసిన ఆరోపణలను జర్నలిస్టు, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ ప్రస్తావించారు. జెన్నిఫర్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భారత్‌ను దోషిగా నిలబెట్టాలని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ ప్రయత్నించారని జెన్నిఫర్ వెల్లడించారు. తైవాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న వ్యూహానికి అనుగుణంగానే ఈ కుట్రలు ఉన్నాయని కూడా పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.
చైనా రచయిత లావో డెంగ్ ప్రకారం, భారత్, పాశ్చాత్య దేశాల బంధాన్ని తెంచేందుకు చైనా అధ్యక్షుడి ఆధ్వర్యంలో ‘ఇగ్నిషన్ ప్లాన్’ సిద్ధం చేశారు. ఈ ఏడాది జులైలో చైనా విదేశాంగ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి అమెరికాలో రహస్య సమావేశం నిర్వహించారు. అనంతరం, నిజ్జర్ ను హత్య చేసేందుకు చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ సీక్రెట్ ఏజెంట్లు రంగంలోకి దిగారు. ఈ హత్యలో భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు వారు అన్ని చర్యలూ తీసుకున్నారు. భారతీయుల యాసలో మాట్లాడడం కూడా నేర్చుకున్నారు. నిజ్జర్ ఆచూకీ తెలుసుకుని అతడిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. ఆ తరువాత హత్యలో తమ పాత్ర బయట పడకుండా అన్ని ఆధారాలు చెరిపేశారు. కారులోని డ్యాష్‌బోర్డు కెమెరాను ధ్వంసం చేశారు. అనంతరం విమానంలో చైనాకు వెళ్లిపోయారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన రెండు సమావేశాల్లోనే ఈ ఇగ్నిషన్ ప్లాన్ రూపుదిద్దుకుంది. కాగా, ఈ ఆరోపణలపై చైనా, భారత్ ఇంకా స్పందించలేదు.