పడి... లేచి... నిలిచి... గెలిచిన టీమిండియా

  • వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ ఆసీస్
  • చెన్నై చెపాక్ స్టేడియంలో మ్యాచ్
  • 6 వికెట్ల తేడాతో నెగ్గిన రోహిత్ సేన
  • ఓ దశలో టీమిండియా గెలుపుపై సందేహాలు
  • అద్భుతంగా ఆడి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిన కేఎల్ రాహుల్, కోహ్లీ
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను అధిగమించి తొలి మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ విసిరిన 200 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓ దశలో టీమిండియా గెలుపుపై అనుమానాలు నెలకొన్నప్పటికీ... విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అర్ధసెంచరీలతో మ్యాచ్ ను మలుపుతిప్పారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 46, వార్నర్ 41 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా 3, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా 2, సిరాజ్ 1, పాండ్యా 1, అశ్విన్ 1 వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది. అయితే విరాట్ కోహ్లీ, కేఎల్  రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ లతో మ్యాచ్ ను భారత్ కు అనుకూలంగా మార్చేశారు.

తొలుత క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యమిచ్చిన కోహ్లీ, రాహుల్ ఆ తర్వాత స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఓసారి కోహ్లీ క్యాచ్ ను మార్ష్ డ్రాప్ చేయగా, ఆ తర్వాత కోహ్లీ మరో అవకాశం ఇవ్వకుండా 85 పరుగులు చేశాడు. చివరికి కోహ్లీ హేజెల్ వుడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. నిలకడైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 3, స్టార్క్ 1 వికెట్ తీశారు. వరల్డ్ కప్ లో టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను అక్టోబరు 11న ఆఫ్ఘనిస్థాన్ తో ఆడనుంది.


More Telugu News