ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు..300 మందికి పైగా దుర్మరణం!

  • పాలస్తీనాలోని గాజాలో 232 మంది
  • హమాస్‌పై ప్రతికారంగా యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్
  • భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరిక
పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై శనివారం జరిపిన ఆకస్మిక దాడుల్లో ఇప్పటివరకూ 300 మందికి పైగా మరణించారు. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో సుమారు 232 మంది అసువులు బాసారు. మరోవైపు హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. తీవ్రదాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. హమాస్‌‌పై వైమానిక దాడులు కూడా ప్రారంభించింది. 

హమాస్ భారీ మూల్యం చెల్లించుకోనుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధం నెలకొందని వ్యాఖ్యానించారు. ‘‘ఇది ప్రత్యేక ఆపరేషన్ కాదు, రెచ్చగొట్టడం కాదు, ఇది యుద్ధం. ఇందులో విజయం మనదే’’ అంటూ దేశప్రజలను ఉద్దేశించి భీషణ ప్రతిజ్ఞ చేశారు. కాగా, ఇజ్రాయెల్‌పై ‘ఆపరేషన్ అల్ కాసా ఫ్లడ్’ ప్రారంభించినట్టు హమాస్‌కు చెందిన సాయుధ దళం ప్రకటించుకుంది.  

మరోవైపు ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారతీయ ఎంబసీ సూచన జారీ చేసింది. అనవసరంగా బయటకు రావద్దని, రక్షణ స్థావరాల్లో తలదాచుకోవాలని సూచించింది. భారతీయులు సంప్రదించేందుకు వీలుగా ఓ హెల్ప్‌లైన్, ఈ-మెయిల్ కూడా అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు, రాకెట్ దాడులతో ధ్వంసమైన భవంతులు, తీవ్రగాయాల పాలైన ప్రజలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.


More Telugu News