'కాంతితో క్రాంతి'... ఢిల్లీలో లోకేశ్, రాజమండ్రిలో భువనేశ్వరి... చంద్రబాబుకు సంఘీభావం

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • మొన్న మోత మోగిద్దాం కార్యాచరణ... నేడు కాంతితో క్రాంతి
  • చంద్రబాబుకు మద్దతుగా దీపాలు వెలిగించాలన్న టీడీపీ
చంద్రబాబుకు సంఘీభావంగా కాంతితో క్రాంతి కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి, కొవ్వొత్తులు వెలిగించాలని, సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయాలని, వాహనదారులు లైట్లు వెలిగించి నిరసన తెలపాలని టీడీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. ఆ మేరకు ఇవాళ టీడీపీ శ్రేణులు కాంతితో క్రాంతి కార్యాచరణ చేపట్టాయి. 

ఢిల్లీలో నారా లోకేశ్ కొవ్వొత్తి చేతబూని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోకేశ్ తో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, టీడీపీ మద్దతుదారులు పాల్గొన్నారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు. 

ఇక, నారా భువనేశ్వరి రాజమండ్రిలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రమిదలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరితో పాటు తెలుగు మహిళలు కూడా దీపాలు వెలిగించి చంద్రబాబు అరెస్ట్ ను నిరసించారు.

అటు, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కాంతితో క్రాంతి కార్యక్రమం గురించి మాట్లాడారు. నిజాయతీగా రాజకీయాలు చేసిన పున్నమి చంద్రుడు చంద్రబాబు అని అభివర్ణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి, 29 రోజులుగా జైలులో ఉంచారని మండిపడ్డారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీకి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగానే విరాళాలు వచ్చాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చి రాష్ట్రంలో వెలుగులు నింపడం తథ్యం అని స్పష్టం చేశారు.


More Telugu News