శ్రీలంక బౌలింగ్ ను చీల్చిచెండాడారు... దక్షిణాఫ్రికా జట్టులో ముగ్గురు సెంచరీలు

  • వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, శ్రీలంక ఢీ
  • టాస్ గెలిచి సఫారీలకు బ్యాటింగ్ అప్పగించిన శ్రీలంక
  • 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా
  • డికాక్, డుస్సెన్, మార్ క్రమ్ సెంచరీల మోత
వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్లు పరుగులు వెల్లువెత్తించారు. శ్రీలంకతో పోరులో ఏకంగా ముగ్గురు సఫారీ ఆటగాళ్లు సెంచరీలతో కదంతొక్కారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విజృంభణకు వేదికగా నిలిచింది. 

ఇవాళ దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య వరల్డ్ కప్ పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక ఎలాంటి ప్రణాళిక వేసుకుందో, ఏమో కానీ... దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించింది. అది ఎంత పెద్ద తప్పిదమో కాసేపటికే అర్థమైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్ డౌన్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్ క్రమ్ శ్రీలంక బౌలింగ్ ను తుత్తునియలు చేస్తూ శతకాలు నమోదు చేశారు. వేసిన బంతిని వేసినట్టు బౌండరీకి తరలించారు. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్లకు 428 పరుగుల అతి భారీ స్కోరు చేసింది. 

డికాక్ 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు చేయగా... వాన్ డర్ డుస్సెన్ 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 108 పరుగులు సాధించాడు. ఇక ఐడెన్ మార్ క్రమ్ చిచ్చరపిడుగులా చెలరేగాడు. మార్ క్రమ్ కేవలం 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు పిండుకున్నాడు. 

డికాక్, డుస్సెన్ అవుటయ్యారన్న సంబరం శ్రీలంక బౌలర్లకు ఎంతో సేపు మిగల్లేదు. మార్ క్రమ్ రూపంలో వారికి పెను విధ్వంసం ఎదురైంది. మార్ క్రమ్ వాయువేగంతో బ్యాటింగ్ చేశాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ సైతం బ్యాట్లకు పనిచెప్పడంతో లంక బౌలర్లు, ఫీల్డర్లు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. క్లాసెన్ 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు బాదగా... మిల్లర్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక 2, కసున్ రజిత 1, మతీశ పతిరణ 1, వెల్లలాగె 1 వికెట్ తీశారు.


More Telugu News