అద్దె భవనం కోసం అలైన్ మెంట్ మార్చమని ఎవరైనా కోరతారా?: బొండా ఉమ
- రింగ్ రోడ్డు ప్రస్తావన లేనప్పుడే హెరిటేజ్ సంస్థ భూములు కొందన్న బొండా ఉమా
- నారాయణ అద్దె భవనంలో కాలేజీ నిర్వహిస్తున్నారని వ్యాఖ్య
- చంద్రబాబుపై పెట్టిన కేసులు నిలబడవన్న ఉమా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రస్తావన లేనప్పుడే అక్కడ హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా తెలిపారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని ఆయన అన్నారు. రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో హెరిటేజ్ సంస్థ భూములను కోల్పోతోందని చెప్పారు. అలైన్ మెంట్ విషయంలో ఎక్కడా తప్పులు జరగలేదని తెలిపారు. ఈ అంశంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే... ఆగమేఘాల మీద కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. పదేపదే అబద్ధాలను మాట్లాడుతూ... అబద్ధాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
మాజీ మంత్రి పి.నారాయణ అద్దె భవనంలో కాలేజీని నిర్వహిస్తున్నారని... ఆ భవనం కోసం అలైన్ మెంట్ మార్చారంటూ తప్పుడు ఆరోపణలు చేశారని బొండా ఉమా విమర్శించారు. అద్దె భవనం కోసం అలైన్ మెంట్ మార్చమని ఎవరైనా కోరతారా? అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ ది దరిద్ర పాదమని... అందుకే అమరావతి నాశనమయిందని చెప్పారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు నిలబడవని అన్నారు.