ఏషియన్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట.. చిరస్మరణీయ విజయమన్న ప్రధాని

  • 100 పతకాల మైలురాయికి చేరుకున్న భారత్
  • 25 బంగారం పతకాలు, 35 వెండి పతకాలు
  • అథ్లెట్లకు అభినందనలు తెలియజేసిన ప్రధాని
ఏషియన్ గేమ్స్ లో భారత్ ముందెన్నడూ లేని విధంగా విజయ బావుటా ఎగురవేస్తోంది. భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. 100 పతకాలు సాధించి జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 25 బంగారు పతకాలు, 35 వెండి పతకాలు, 40 కాంస్య పతకాలను భారత అథ్లెట్లు గెలుచుకున్నారు. శనివారం ఉదయం ఆర్చరీ, మహిళ కబడ్డీలో భారత్ మూడు బంగారం పతకాలను కైవసం చేసుకుంది. ఆర్చరీ విభాగంలో జ్యోతి వెన్నమ్, ప్రవీణ ఓజస్ బంగారం పతకాలను గెలుచుకున్నారు. చైనీస్ తైపీ జట్టును ఓడించి భారత మహిళల కబడ్డీ జట్టు బంగారం పతకం సొంతం చేసుకుంది. దీంతో జాబితాలో భారత్ ఖాతాలో 100 మెడల్స్ చేరాయి. 

దీన్ని చిరస్మరణీయ విజయంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పురస్కారాలను భారత్ కు తీసుకొచ్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ఏషియన్ గేమ్స్ లో భారత్ కు చిరస్మరణీయ విజయం. నూరు మెడళ్ల మైలురాయిని చేరుకున్నందుకు భారతీయులు ఉద్వేగానికి గురవుతున్నారు. మన అసాధారణ క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. వారి కృషితోనే భారత్ ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించింది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆసియా క్రీడాకారుల బృందానికి ఈ నెల 10న ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఏషియన్ గేమ్స్ లో అత్యధికంగా 354 పతకాలతో చైనా ముందుంది. జపాన్ 169, దక్షిణ కొరియా 170 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.


More Telugu News