టీడీపీ అధికారంలోకి వస్తే తాటతీస్తామంటున్నారు.. మన పరిస్థితి ఏంటో?.. మాజీ మంత్రి బాలినేని ఆవేదన

  • ఒంగోలులో ‘ఏపీకి జగన్ ఎందుకు కావాలి’ అంశంపై సమావేశంలో బాలినేని వ్యాఖ్యలు
  • టీడీపీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన
  • మంత్రి పదవి పోయినందుకు బాధగానే ఉందన్న మాజీ మంత్రి
అధికారంలోకి వస్తే మన తాట తీస్తామని తెలుగుదేశం, జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారని, కాబట్టి వారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ‘ఏపీకి జగన్ ఎందుకు కావాలి’ అంశంపై నిన్న ఒంగోలులో వైసీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలపై జగనన్న సురక్ష రాష్ట్ర కన్వీనర్ శివశంకర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి బాలినేని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. మంత్రి పదవి పోవడం బాధే అయినా అసంతృప్తులు, నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని, టికెట్ ఎవరికి దక్కినా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వలంటీర్లలో 90 శాతం వైసీపీ మద్దతుదారులేనని, ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్తే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. జగన్‌ను జైలులో పెట్టినప్పుడు న్యాయస్థానాన్ని గౌరవిస్తూ వైసీపీ నాయకులెవరూ రోడ్డెక్కలేదని, కానీ చంద్రబాబును పెడితే న్యాయస్థానాన్ని టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయని బాలినేని విమర్శించారు.



More Telugu News