బాలీవుడ్ తారల మెడకు బెట్టింగ్ యాప్ ఉచ్చు... శ్రద్ధా కపూర్ కు ఈడీ సమన్లు

  • మహాదేవ్ బెట్టింగ్ యాప్ పై కేంద్రం ఫోకస్
  • యాప్ ద్వారా రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతున్న వైనం
  • ఇప్పటికే పలువురు బాలీవుడ్ తారలకు ఈడీ సమన్లు
  • ఇవాళ విచారణకు రావాలని శ్రద్ధా కపూర్ కు సమన్లు
మహాదేవ్ బెట్టింప్ యాప్ కార్యకలాపాలు మోసపూరితంగా ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విచారణకు తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం పలువురు బాలీవుడ్ తారల మెడకు చుట్టుకుంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేశారన్న కారణంతో ఇప్పటివరకు రణబీర్ కపూర్, హ్యూమా ఖురేషీ, హీనా ఖాన్, కపిల్ శర్మ వంటి సెలబ్రిటీలకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. యాప్ ప్రమోటర్లతో బాలీవుడ్ నటులకు ఎలాంటి సంబంధాలున్నాయనేది నిగ్గు తేల్చాలని ఈడీ భావిస్తోంది. 

తాజాగా, ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ కు కూడా ఈడీ సమన్లు పంపింది. ఇవాళ విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే, శ్రద్ధా విచారణకు హాజరయిందా, లేదా అనేదానిపై తాజా సమాచారం లేదు. 

మహాదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రోజుకు రూ.200 కోట్లు చేతులు మారుతున్నట్టు భావిస్తున్నారు. ఈ యాప్ కు పలు దేశాల్లో బీటర్లు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్ కు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. యూఏఈ నుంచి ఈ యాప్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు ఈడీ గుర్తించింది. బాలీవుడ్ తారలు ఈ యాప్ కోసం ప్రచారం చేసి ప్రమోటర్ల నుంచి డబ్బు తీసుకున్నట్టు ఈడీ పేర్కొంటోంది. మహాదేవ్ యాప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని హవాలా మార్గంలో బదిలీ చేస్తున్నారని వెల్లడైంది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ యూఏఈలో అట్టహాసంగా పెళ్లి చేసుకోగా, పెద్ద సంఖ్యలో బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి ఖర్చు రూ.200 కోట్లు అని తెలుస్తోంది. ఈడీ ఈ అంశంపైనా దృష్టి సారించింది.


More Telugu News