దేశంలో ఎక్కువ మంది అపార్థం చేసుకున్న క్రికెటర్ అతడు: అశ్విన్ 

  • గౌతమ్ గంభీర్ స్వార్థం లేని వ్యక్తి అంటూ ప్రశంస
  • జట్టులో గొప్ప సభ్యుడే కాదు, గొప్పగా పోరాడగలడన్న అశ్విన్
  • అతడి కృషికి వచ్చిన గుర్తింపు తక్కువేనని వ్యాఖ్య 
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ లో ఎక్కువ మంది పొరపాటుగా అర్థం చేసుకున్న క్రికెటర్ గంభీర్ అంటూ కామెంట్ చేశాడు. గంభీర్ టీమిండియాకు ఎన్నో సేవలు అందించిన క్రికెటర్ అనడంలో సందేహం లేదు. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు కూడా. ఐపీఎల్ లో కోల్ కతా జట్టుకు అతడు రెండు సార్లు టైటిళ్లు తెచ్చి పెట్టాడు. కాకపోతే ఎన్నో వివాదాలకు అతడు కేంద్రంగా మారుతుండడం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో గంభీర్ వైరం గురించి.. కోహ్లీ అభిమానులు గంభీర్ ను దూషించడం, కించపరచడం గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలో గంభీర్ కు మద్దతుగా అశ్విన్ మాట్లాడడం గమనార్హం.

‘‘గౌతమ్ గంభీర్ దేశంలోనే ఎక్కువ మంది అపార్థం చేసుకున్న క్రికెటర్. జట్టులో గొప్ప సభ్యుడిగానే కాదు, తన వంతుగా పోరాడే విషయంలోనూ అతడు గొప్పగా పనిచేస్తాడు. కాకపోతే అతడు తన గురించి గొప్పగా చెప్పుకోలేడు. ఒక్క ప్రపంచకప్ ఫైనల్ అనే కాదు, ఫైనల్ కు తీసుకెళ్లిన ఎన్నో పోరాటాలు ఉన్నాయి. సాధారణంగా జట్టును ఒత్తిడిలోకి వెళ్లనీయడు. స్వార్థం లేని వ్యక్తి. అతడి పట్ల నాకు ఎప్పుడూ గొప్ప గౌరవమే ఉంటుంది. నిజానికి గంభీర్ కు ఉన్న అర్హతల కంటే (కృషికి) ప్రజలు అతడికి ఇచ్చిన గుర్తింపు తక్కువే’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.


More Telugu News