బీజేపీ ఒకటిస్తే.. కాంగ్రెస్ రెండు ఇచ్చింది.. ముదురుతున్న పోస్టర్ వార్!

  • రాహుల్‌ను రావణుడితో పోలుస్తూ ఫొటోను షేర్ చేసిన బీజేపీ
  •  ప్రతిగా ప్రధాని మోదీ రెండు ఫొటోలను పోస్టు చేసిన కాంగ్రెస్
  • బీజేపీ సమర్పణలో ప్రధాని నటిస్తున్న ‘జుమ్లాబాయ్’ త్వరలోనే ఎన్నికల ర్యాలీకి వస్తుందని ఒకటి
  • అతిపెద్ద అబద్ధాలకోరు నేనేనంటున్నట్టుగా ఉన్న మరో పోస్టర్ షేర్ చేసిన కాంగ్రెస్
  • ప్రధానమంత్రి అబద్ధాల రోగ లక్షణంతో బాధపడుతున్నాన్న జైరాం రమేశ్
బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్ ముదురుతోంది. బీజేపీ నిన్న రాహుల్‌గాంధీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రావణుడితో పోల్చింది. ఇతడో దుష్టశక్తి అని, ధర్మానికి వ్యతిరేకి, రాముడికి విరోధి అని తీవ్ర విమర్శలు చేసింది. ఈ పోస్టర్‌పై కాంగ్రెస్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లాం ఎక్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలను షేర్ చేసింది. 

అవి సినిమా పోస్టర్లను తలపిస్తున్నాయి.. ‘త్వరలోనే ఎన్నికల ర్యాలీకి వస్తున్నా’ అన్న క్యాప్షన్ తగిలించిన ఓ ఫొటోకు ‘బీజేపీ సమర్పణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నటిస్తున్న ‘జుమ్లాబాయ్’’ అని రాసుకొచ్చింది. ‘అతిపెద్ద అబద్ధాలకోరు ఎవరు?’ అన్న ప్రశ్నకు.. ‘అది నేనే’ అంటూ మోదీ చెయ్యెత్తి చెబుతున్నట్టుగా ఉన్న మరో ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘అతిపెద్ద అబద్ధాలకోరు’ అన్న క్యాప్షన్ తగిలించింది.
    బీజేపీ పోస్టర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎక్స్‌లో విరుచుకుపడ్డారు. ఇండియా విభజన శక్తులు రాహుల్ తండ్రి, నానమ్మను బలితీసుకున్నాయని, ఇప్పుడా శక్తులను రాహుల్‌పైకి రెచ్చగొట్టి హింసను ప్రేరేపించడమే బీజేపీ పోస్టర్ ఉద్దేశమని ఆరోపించారు. ప్రధాని మోదీకి అబద్ధాల రోగలక్షణం ఉందని, నార్సిస్టిక్ వ్యక్తిత్వ రుగ్మతతో ఆయన బాధపడుతున్నారని మండిపడ్డారు. ఇది చాలా ప్రమాదకరమైనదని పేర్కొన్నారు. బీజేపీ తీరుతో తాము బెదిరిపోబోమని తేల్చిచెప్పారు.  



More Telugu News