వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో విరుచుకుపడిన రచిన్ రవీంద్ర.. అనంతపురంతో అతనికున్న సంబంధం ఏమిటి?

  • ఇండియాలోనే పుట్టిన రచిన్ రవీంద్ర తల్లిదండ్రులు
  • 1990ల్లో న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడే స్థిరపడిన వైనం
  • ప్రతి ఏడాది అనంతపురంలోని ఆర్డీటీకి వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడిన రవీంద్ర
2023 వన్డే ప్రపంచకప్ ను న్యూజిలాండ్ జట్టు ఘనంగా ఆరంభించింది. ఇంగ్లండ్ పై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ 9 వికెట్లకు 282 పరుగులు చేయగా... కేవలం 36.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి న్యూజిలాండ్ విజయకేతనం ఎగురవేసింది. కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ రచిన్ రవీంద్ర సెంచరీలతో కదంతొక్కారు. మరో ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ అయినప్పటికీ... దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, మరో వికెట్ కోల్పోకుండా వీరిద్దరూ మ్యాచ్ ను ఫినిష్ చేశారు. 

తొలి ప్రపంచ కప్ ఆడుతున్న 23 ఏళ్ల రచిన్ రవీంద్ర తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేయడం అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో రవీంద్ర ఇప్పటి వరకు కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడాడు. మరోవైపు ఈ రచిన్ రవీంద్ర ఎవరని చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. రవీంద్ర తల్లిదండ్రులు ఇండియాలోనే పుట్టారు. రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తిది బెంగళూరు. 1990ల్లో వీరు న్యూజిలాండ్ కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. రచిన్ రవీంద్ర అక్కడే పుట్టాడు.

న్యూజిలాండ్ లో ఉంటున్నా... రవీంద్ర క్రికెట్లో రాటు తేలింది మాత్రం ఆంధ్రప్రదేశ్ లోనే. క్రికెటర్ గా అతనిని రాటుతేల్చింది అనంతపురం. ప్రతి ఏడాది అనంతపురంకు వచ్చి... అక్కడ ఉన్న ఆర్డీటీ (రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్)కి వచ్చి క్రికెట్ ట్రైనింగ్ పొందడమే కాక, టోర్నీలు ఆడేవాడు. రవీంద్ర తండ్రికి న్యూజిలాండ్ లో హాట్ హాక్స్ పేరుతో క్రికెట్ క్లబ్ ఉంది. ఆ క్లబ్ తరపున ఇతర ప్లేయర్లతో కలిసి రవీంద్ర ఇక్కడకు వచ్చి క్రికెట్ టోర్నీలు ఆడేవాడు. ఆ విధంగా అతనికి, అనంతపురంకు అవినాభావ సంబంధం ఉంది. మరోవైపు తన అభిమాన క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ అని రవీంద్ర పలు సందర్భాల్లో చెప్పాడు.


More Telugu News