శుభ్‌మన్ గిల్‌కు డెంగీ.. ఆస్ట్రేలియాతో ఆడేది డౌటేనా?

  • డెంగీతో బాధపడుతున్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 
  • వరల్డ్ కప్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఆడటంపై సందేహాలు
  • శుక్రవారం శుభ్‌మన్ గిల్‌కు మరో దఫా వైద్య పరీక్షలు 
  • ఈ రిపోర్టుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామంటున్న టీమిండియా మేనేజ్‌మెంట్
  • శుభ్‌మన్ గిల్ లేకపోతే కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే ఛాన్స్
ఈ ఏడాది అద్భుత ఫామ్‌లో ఉన్న భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగే భారత్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. శుభ్‌మన్ గిల్ డెంగీ బారినపడ్డట్టు గురువారం వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. నేడు అతడికి మరో దఫా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రిపోర్టుల అధారంగా శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో ఆడేదీ, లేనిదీ నిర్ణయిస్తామని టీం మేనేజ్‌మెంట్ తాజాగా ప్రకటించింది. 

అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ సమయానికి గిల్ ఆరోగ్యం మెరుగుపడకపోతే కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్‌ ఓపెనర్‌గా దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2019 నాటి ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ భారత్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అప్పట్లో గాయం కారణంగా శిఖర్ ధవన్ అందుబాటులో లేకపోవడంతో రాహుల్‌ను దించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో రోహిత్ అందుబాటులో లేని పలు మ్యాచ్‌ల్లో ఇషాన్ ఓపెనర్‌‌గా వచ్చాడు. 

ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది ఇప్పటివరకూ 20 వన్‌డేల్లో ఏకంగా 1230 పరుగులు చేశాడు. వన్‌డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో, అతడు తొలి మ్యాచ్‌కు దూరమైతే భారత్‌కు ఇబ్బందికరమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


More Telugu News