బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయొద్దు: ఏపీ హైకోర్టు
- వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు
- ఏడేళ్లు శిక్ష పడేలా సెక్షన్లు పెట్టారన్న వెంకన్న న్యాయవాదులు
- సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల గన్నవరంలో జరిగిన సభలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలపై బుద్దా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే పేర్ని నాని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకన్నపై అత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బుద్దా వెంకన్న హైకోర్టును ఆశ్రయించారు. వెంకన్నపై నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లు జైలు శిక్ష పడేవిగా ఉన్నాయని విచారణ సందర్భంగా కోర్టుకు ఆయన న్యాయవాదులు తెలిపారు. ఇరువైపుల వాదనలను విన్న కోర్టు వెంకన్నను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.