కేబినెట్ భేటీలో కృష్ణా జలాల పంపిణీ వివాదంపై కీలక నిర్ణయం: కిషన్ రెడ్డి

  • బుధవారం ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ
  • కృష్ణా జలాల పంపిణీ వివాదం పరిష్కార బాధ్యతలను రెండవ కృష్ణా ట్రైబ్యునల్‌కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం
  • కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించిన మంత్రి కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ అత్యవసర భేటీలో తెలంగాణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదానికి పరిష్కారం దిశగా కృష్ణా ట్రైబ్యునల్‌కు-2కు అదనపు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు అయినట్టు పేర్కొన్నారు. విభజన సెక్షన్‌లోని సెక్షన్ 89కు లోబడే ఈ బాధ్యతలు అప్పగించినట్టు వివరించారు. దీంతో, కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు. 

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున తాను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. పసుపు ఉత్పత్తితో దేశంలోనే మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా రెండో స్థానం తెలంగాణాదేనని తెలిపారు. పసుపు ఉత్పత్తులు పెంచే బాధ్యత, పసుపు వినియోగంపై నిర్ణయాలు బోర్డు తీసుకుంటుందని వివరించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క, సారక్క పేరు ఖరారు కావడంపై కూడా మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News