ఇక ఆఫీసులకు రండి... ఉద్యోగులకు ఐటీ కంపెనీల పిలుపు!

  • వర్క్ ఫ్రం హోం సంస్కృతిని ముగించేందుకు సిద్ధమైన ఐటీ సంస్థలు
  • వారానికి ఐదు రోజులు కార్యాలయాలకు రావాలంటూ ఉద్యోగులకు అనధికారికంగా స్పష్టీకరణ
  • ఉద్యోగుల నుంచి ప్రతిఘటన రాకుండా ఆచితూచి అడుగులు
  • ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతుండటంతో ఈ చర్యకు పూనుకుంటున్న సంస్థలు
వర్క్ ఫ్రం హోం సంస్కృతికి ముగింపు పలికేందుకు ఐటీ కంపెనీలు నడుం కట్టాయి. ఈ దిశగా కీలక చర్యలు ప్రారంభించాయి. ప్రస్తుతం అమలవుతున్న హైబ్రీడ్ మోడల్‌కు ముగింపు పలికి, టెక్కీలు వారానికి ఐదు రోజుల పాటు ఆఫీసుకొచ్చి పనిచేయాలంటూ ఇప్పటికే అనేక కంపెనీల యాజమాన్యాలు మౌఖిక, అనధికార మార్గాల్లో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అయితే, ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉండటంతో సంయమనం పాటిస్తూ ‘వర్క్ ఫ్రం హోం’ను ముగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పూణే, బెంగళూరు వంటి ఐటీ నగరాల్లో అధిక శాతం కంపెనీలు ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

తమ ఉద్యోగులు ఈ నెల నుంచీ వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఎరిక్సన్ సంస్థ ఇటీవల స్పష్టం చేసింది. ఫిసర్వ్ కంపెనీ కూడా తన ఉద్యోగులను నవంబర్ నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాలని స్పష్టం చేసింది. క్యాప్‌జెమినీ కూడా వారానికి మూడు రోజుల పాటు ఉద్యోగులు కార్యాలయానికి రావాలని పేర్కొంది. ఇటీవలే టీసీఎస్ సంస్థ కూడా ఇదే తరహా అనధికార ఆదేశాలు జారీ చేసింది. ఎల్‌టీఐమైండ్ ట్రీ, యాక్సెంచర్, హెచ్‌సీఎల్ టెక్ కూడా వర్క్ ఫ్రం హోం ముగించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కారణంగా ఐటీ సేవలకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఉద్యోగుల్లో ఉత్పాదకత పెంచేందుకు కంపెనీలు వర్క్ ఫ్రం హోం ముగించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సమాచార, భద్రతా సమస్యల నివారణకు కూడా ఇది అవసరమని కంపెనీలు భావిస్తున్నాయి.


More Telugu News