దయచేసి ఆ ఒక్కటీ నన్ను అడగకండి: విరాట్ కోహ్లీ

  • వన్డే ప్రపంచకప్ మ్యాచులు చూసేందుకు స్నేహితుల  ఆసక్తి
  • టికెట్లు ఇప్పించాలంటూ కోహ్లీకి ఫ్రెండ్స్ నుంచి డిమాండ్
  • తనను టికెట్లు కోరొద్దంటూ, ఇంటి నుంచే చూడాలని సూచన
వన్డే ప్రపంచకప్ సమరం రేపటి నుంచే (అక్టోబర్ 5న) ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా మైదానంలో ఉండి చూసేందుకు ఎక్కువ మంది అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే టికెట్ల బుకింగ్ కు భారీ స్పందన లభిస్తోంది. ఈ తరుణంలో టీమిండియా స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ కీలక సూచన చేశాడు. 

విరాట్ కోహ్లీకి మంచి పలుకుబడి ఉండడంతో, అతడి ద్వారా మ్యాచ్ టికెట్లు సంపాదిద్దామనే ఆలోచన కొందరిలో కనిపిస్తోంది. తమకు టికెట్లు ఇప్పించాలని కోరుతున్నట్టు తెలిసింది. టికెట్లు కావాలంటూ తన దగ్గరకు వచ్చే స్నేహితులకు విరాట్ కోహ్లీ ముఖ్య సూచన చేశాడు. 

‘‘ప్రపంచకప్ సమీపిస్తోంది. నా స్నేహితులు అందరినీ వినయంగా కోరేదేమంటే.. టోర్నమెంట్ వ్యాప్తంగా టికెట్ల కోసం నన్ను అభ్యర్థించొద్దు. దయచేసి మీ ఇంటి నుంచే ఎంజాయ్ చేయండి’’ అని ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో కోహ్లీ పోస్ట్ పెట్టాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ఒక టికెట్ ధర రూ.56 లక్షలకు చేరిందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ.18-22 లక్షల ధరలో చాలా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.


More Telugu News