ఆ రెండు యాప్స్‌ను నా ఫోన్‌ నుంచి తీసేశా: రోహిత్ శర్మ

  • 9 నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న 
    భారత కెప్టెన్
  • ట్విట్టర్, ఇన్‌స్టాను తన ఫోన్‌లో లేవని వెల్లడి
  • రేపటి నుంచి భారత్‌లో వన్డే ప్రపంచ కప్‌
సొంతగడ్డపై రేపటి నుంచి జరిగే వన్డే ప్రపంచ కప్ లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చివరగా 12 ఏళ్ల కిందట స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో ధోనీసేన వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాతి రెండు ఎడిషన్లలో సెమీఫైనల్స్‌తోనే సరిపెట్టిన భారత్ ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని ఆశిస్తోంది. ఇందుకోసం దాదాపు ఏడాది నుంచి పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నాడు. ఈ టోర్నీలో జట్టును గెలిపించేందుకు రోహిత్ సైతం వ్యక్తిగతంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. 

గత తొమ్మిది నెలలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని రోహిత్ స్వయంగా వెల్లడించాడు. అసలు తన ఫోన్‌లో ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టా యాప్స్‌నే తొలగించినట్టు తెలిపాడు. ‘గత 9 నెలలుగా నా ఫోన్‌లో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లేవు. నేను ఏదైనా వాణిజ్య పోస్ట్ చేయాల్సి ఉంటే ఆ పని నా భార్య చూసుకుంటోంది. ఇవన్నీ ఆట నుంచి దృష్టిని మరలుస్తాయి. వీటిని చూడటం వల్ల సమయం, శక్తి రెండూ వృథా అవుతాయి. కాబట్టి వీటిని ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నా. ఫోన్‌లో ఉంటే చూస్తానని ఆ యాప్స్‌ను పూర్తిగా తొలగించా’ అని రోహిత్ వెల్లడించాడు.


More Telugu News