సర్వరోగ నివారిణి పారాసెటమాల్ తో సైడ్ ఎఫెక్ట్స్.. మోతాదు మించితే కొత్త సమస్యలు

  • డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో పెరిగిన మాత్రల వాడకం
  • శ్రుతిమించితే కాలేయానికి నష్టం తప్పదంటున్న నిపుణులు
  • వైద్యుల సూచనలకు మించి పారాసెటమాల్ వేసుకోవద్దని హెచ్చరిక
ఒంట్లో కాస్త నలతగా అనిపించినా.. శరీరం కాస్త వెచ్చబడినా.. తలనొప్పి, ఒళ్లు నొప్పులు.. ఇలా ఒకటేమిటి అన్నింటికీ ఒక్కటే మాత్ర.. అదే పారాసెటమాల్. వైద్యుల సూచనల ప్రకారం వాడితే పర్వాలేదు కానీ సొంతంగా పారాసెటమాల్ మాత్రలు వాడేటపుడు జాగ్రత్తగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం సర్వ రోగ నివారిణిలా చూస్తున్న పారాసెటమాల్ మాత్రలు మోతాదు మించి తీసుకుంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. జ్వరం బాధితులు పెరగడంతో పారాసెటమాల్ మాత్రల వాడకం కూడా పెరిగింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పారాసెటమాల్ మాత్రలతో ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో శ్రుతిమించిన వాడకంతో నష్టాలు కూడా అన్నే ఉన్నాయని పలు అధ్యయనాలలో వెల్లడైంది. ఈ మాత్రల డోసు ఎక్కువైతే దాని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో వాంతులు, తలతిప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయని, కాసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయని వివరించారు. పారాసెటమాల్ మాత్రల వాడకం పెరిగితే కాలేయం దెబ్బతింటుందని హెచ్చరించారు. కళ్లు, చర్మం పచ్చగా మారడం, మూత్రం రంగు మారడం, పొత్తికడుపులో నొప్పి తదితర లక్షణాలు కాలేయ సమస్యలకు చిహ్నాలని తెలిపారు.

ఈ మాత్రల డోసు పెరిగిందంటే రక్తస్రావానికి దారితీయొచ్చని, ఆస్పిరిన్ వంటి మాత్రలతో కలిపి పారాసెటమాల్ ను తీసుకోవడం వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. మరికొందరిలో పారాసెటమాల్ మాత్రల ఓవర్ డోస్ వల్ల శరీరంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. పారాసెటమాల్ మాత్రలను దీర్ఘకాలం పాటు వాడితే అనీమియా బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు. రోజుకు 4 గ్రాములకు మించి పారాసెటమాల్ తీసుకుంటే ముప్పు తప్పదని తెలిపారు.


More Telugu News