ఫ్లోరిడా ఈతకొలనులో శవమై కనిపించిన హైదరాబాద్ డెలివరీ ఏజెంట్.. అరగంటకే మృతదేహం తేలడంపై మిస్టరీ!

  • నిరుడు డిసెంబరులో ఫ్లోరిడా వెళ్లిన మొహమ్మద్ ముస్తఫా
  • అక్కడ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ వాసి
  • పార్శిల్ డెలివరీకి వెళ్లిన అరగంటకే అనుమానాస్పద స్థితిలో మృతి
  • మృతదేహాన్ని చూసేందుకు అనుమతించని పోలీసులు
హైదరాబాద్‌కు చెందిన 31 సంవత్సరాల డెలివరీ ఏజెంట్ మొహమ్మద్ ముస్తఫా షరీఫ్ అమెరికాలోని ఫ్లోరిడా ఈతకొలనులో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఈ నెల 2న పార్సిల్ డెలివరీకి వెళ్లిన ఆయన ఆ తర్వాత మృతి చెంది కనిపించాడు. హైదరాబాద్‌లోని ఆర్సీఐ బాలాపూర్‌లో ఉంటున్న ఆయన కుటుంబం ముస్తఫా మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేసింది. 

షరీఫ్‌కు భార్య తాహెరా బాను, రెండేళ్ల మొహమ్మద్ షేజాద్, ఐదు నెలల వయసున్న మొహమ్మద్ హమ్జా ఉన్నారు. ముస్తఫా పార్శిల్ డెలివరీ కోసం వెళ్లాడని, అరగంట తర్వాత పార్టీ ఏరియాలోని స్విమ్మింగ్ పూల్‌లో అతడి శవం తేలుతూ కనిపించిందని ముస్తఫా సోదరుడు మొహమ్మద్ నవాజ్ షరీఫ్ ‘డెక్కన్ క్రానికల్’తో చెప్పారు.  ముస్తఫా మృతదేహాన్ని చూసేందుకు కూడా తన వదిన, సోదరుడిని పోలీసులు అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

ముస్తఫా నిరుడు డిసెంబరు మధ్యలో డిపెండెంట్ వీసాపై ఫ్లోరిడా వెళ్లాడు. ఆయన భార్య తాహెరా బాను అమెరికా పౌరురాలు. ఫ్లోరిడా వెళ్లాక ముస్తఫా ఏజెంట్ పనిచేస్తున్నారు. కాగా, స్విమ్మింగ్‌పూల్ ఉన్న ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేవు. సాధారణంగా మృతదేహం నీటిపై తేలడానికి మూడు,నాలుగు గంటలు పడుతుంది. కానీ ముస్తఫా మాత్రం డెలివరీకి వెళ్లిన 50 నిమిషాల తర్వాత శవమై నీటిపై తేలడం అనుమానాలకు తావిస్తోంది. ముస్తఫా అనుమానాస్పద మృతిపై స్పందించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసలు ఏం జరిగిందన్న విషయాన్ని కనుక్కుంటానని ఆయన కుటుంబానికి హామీ ఇచ్చారు.


More Telugu News