నేను సీఎం కావడానికి మోదీ అనుమతి అక్కర్లేదు, ప్రధాని వద్దకు వెళ్తే రికార్డ్ చేయాలి: కేటీఆర్

  • నన్ను ఆశీర్వదించాలని కేసీఆర్ చెప్పారంటూ ప్రధాని అబద్దాలు మాట్లాడారన్న కేటీఅర్
  • ప్రధాని మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ అవార్డు వస్తుందంటూ ఎద్దేవా
  • తెలంగాణ గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శ
  • ఎన్డీయే మునిగిపోయే నావ.. ఎవరూ ఎక్కాలనుకోరని వ్యాఖ్య
తనను ఆశీర్వదించాలని తన తండ్రి, సీఎం కేసీఆర్ చెప్పారని ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని, తాను ముఖ్యమంత్రి కావడానికి ఆయన అనుమతి అక్కరలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏడు పదుల వయస్సులో ప్రధాని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఈ అబద్ధాలతో ఆయన తన పదవి గౌరవాన్ని తగ్గించుకున్నారన్నారు. నిజామాబాద్ సభలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన యాక్టింగ్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్ట్ రాస్తే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయన్నారు.

తెలంగాణ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఇక నుంచి ఎవరైనా ప్రధాని మోదీని కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణను రికార్డ్ చేసుకుంటే మంచిదన్నారు. ఎన్డీయేలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదని, ఆ కూటమి నుంచే పార్టీలు బయటకు వచ్చాయన్నారు.

ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన పార్టీల పైకి ఈడీ, సీబీఐని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారిపై ఏమైనా కేసులు ఉంటే వెనక్కి పడిపోతున్నాయన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జూమ్లా పార్టీ అని విమర్శించారు. ఎన్డీయే మునిగిపోయే నావ అని, అలాంటి దానిని ఎక్కాలని ఎవరూ అనుకోరన్నారు.


More Telugu News