ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని పిటిషన్
  • హైకోర్టులో తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన రేవంత్ రెడ్డి
  • అక్కడా రేవంత్ రెడ్డికి చుక్కెదురు
ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని దాఖలు చేసిన పిటిషన్లను గతంలో హైకోర్టు కొట్టివేసింది. దీనిపై రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఇదే కేసులో సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది.

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వజూపిన వైనంపై కేసును ఎదుర్కొంటున్నారు. రూ.50 లక్షలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో ఏసీబీ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ ఆయన తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.


More Telugu News