ఒకరేమో ఇంజనీర్.. ఇంకొకరు పీహెచ్ డీ విద్యార్థి.. ఉగ్రవాదుల్లో ఉన్నతవిద్యావంతులు!

  • ఢిల్లీ, యూపీల్లో పలువురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన పోలీసులు
  • విచారణలో వారంతా ఉన్నతవిద్యావంతులేనని నిర్ధారణ 
  • మైనింగ్ ఇంజనీర్ గా తన తెలివితేటలను పేలుళ్లకు వాడుతున్న టెర్రరిస్టు
వారంతా ఉన్నత చదువులు పూర్తి చేసిన వారే.. ఒకరు పీహెచ్ డీ చదువుతుండగా.. మరొకరేమో మైనింగ్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. ఈ చదువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని మంచికి కాకుండా ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాదులను విచారించగా ఈ విషయాలు బయటపడ్డాయని పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ ఉగ్రవాదులంతా ఉన్నతవిద్యావంతులేనని తెలిసి ఆశ్చర్యపోయినట్లు వివరించారు.

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉన్నతాధికారి హెచ్ జీఎస్ దాలివాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, యూపీలలో సోమవారం అదుపులోకి తీసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్ టెర్రరిస్టులు) దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నారు. ఇందుకోసం షానవాజ్, రిజ్వాన్ అష్రాఫ్, మొహమ్మద్ అర్షద్ వార్సి తదితరులు దేశంలోని వివిధ ప్రాంతాలలో రెక్కీ కూడా నిర్వహించారు. ఇందులో ఝార్ఖండ్ కు చెందిన షానవాజ్ మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ బ్లాస్ట్ లపై తనకున్న పరిజ్ఞానాన్ని ఉగ్ర పేలుళ్లకు ఉపయోగిస్తున్నాడు.

ఢిల్లీలోని షానవాజ్ స్థావరంలో జిహాద్ కు సంబంధించిన పుస్తకాలు, రసాయనాలు దొరికాయి. విదేశాల్లోని ఉగ్రవాదులతో నిత్యం టచ్ లో ఉంటుండేవాడు. మహమ్మద్ యూనిస్, మహమ్మద్ యాకూబ్ షేక్ లతో కలిసి షానవాజ్ పూణేలో ఓ బైక్ దొంగతనం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు వారు ఉంటున్న ఇళ్లను సోదా చేయడానికి తీసుకెళుతుండగా షానవాజ్ తప్పించుకున్నాడు. 

మొహమ్మద్ అర్షద్ వార్సి కూడా ఝార్ఖండ్ కు చెందిన వాడే.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన అర్షద్ వార్సి ప్రస్తుతం ఢిల్లీలోని జామియా మిలియాలో పీహెచ్ డీ చేస్తున్నాడు. రిజ్వాన్ అష్రాఫ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడు.. కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తిచేశాడు. మతగురువుగా శిక్షణ పొంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని దాలివాల్ తెలిపారు.


More Telugu News