చంద్రబాబు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.. సర్వత్ర ఉత్కంఠ

  • చంద్రబాబు తరపున లూథ్రా, సాల్వే వాదనలు
  • ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదనలు
  • హైకోర్టు తీర్పులో 17ఏని తప్పుగా అన్వయించారన్న సాల్వే
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టులో ప్రారంభమయింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు వింటోంది. చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే, ఏఎం సింఘ్వీ వాదలను వినిపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి, రంజిత్ కుమార్ వాదిస్తున్నారు. 

వాదనల సందర్భంగా హైకోర్టు తీర్పులో 17ఏని తప్పుగా అన్వయించారని కోర్టుకు హరీశ్ సాల్వే తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు కక్షపూరితంగా ఉన్నాయని చెప్పారు. ఈ కేసు విచారణను 2021 సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభించినట్టు ఏడీజీపీ లెటర్ ను బట్టి తెలుస్తోందని కోర్టుకు తెలిపారు. విచారణ తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. 2018లో 17ఏపై చట్ట సవరణ జరిగిందని చెప్పారు. 2018 తర్వాత నమోదైన కేసులన్నింటీకి 17ఏ వర్తిస్తుందని తెలిపారు.  నేరం ఎప్పుడు జరిగిందనేది ముఖ్యం కాదని, ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారనేదే ముఖ్యమని అన్నారు. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సింఘ్వీ తన వాదనలు వినిపిస్తూ రాఫెల్ కేసులో యశ్వంత్ సిన్హా కేసులు ఉదహరించారు. మరోవైపు కోర్టులో విచారణ ప్రారంభమైన నేపథ్యంలో తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.


More Telugu News