చంద్రబాబు కుటుంబాన్ని కలిసేందుకు బయలుదేరిన అమరావతి రైతులు.. మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు

  • చంద్రబాబును అక్రమంగా జైలులో బంధించారని రైతుల ఆరోపణ
  • మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడి
  • ఏదేమైనా రాజమండ్రి వెళ్లి తీరతామని స్పష్టం చేసిన రైతులు
అమరావతి రూపశిల్పి చంద్రబాబును ప్రభుత్వం అక్రమంగా జైలులో పెట్టిందని తుళ్లూరు, వెలగపూడి ప్రాంత రైతులు ఆరోపించారు. భర్త అరెస్టుతో ఆవేదన చెందుతున్న నారా భువనేశ్వరిని పలకరించి, అండగా తామంతా ఉన్నామని చెప్పేందుకే రాజమండ్రి బయలుదేరామని వివరించారు. రాజమండ్రి వెళ్లకుండా పోలీసులు తమను అడ్డుకోవడంపై వారంతా మండిపడుతున్నారు. తామేమీ పాకిస్థాన్ నుంచి రాలేదని, తాము రాజమండ్రి ఎందుకు వెళ్లకూడదని అమరావతి ప్రాంత రైతులు పోలీసులను నిలదీశారు.

చంద్రబాబు కుటుంబాన్ని కలిసేందుకు అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు మంగళవారం ఉదయం బస్సులు, సొంత వాహనాలలో బయలుదేరారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలను కలిసి సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో వెళుతున్న వారిని వీరవల్లి, నల్లజర్ల టోల్ గేట్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారు రాజమండ్రి వెళ్లేందుకు అనుమతిలేదంటూ బస్సు డ్రైవర్లను బలవంతంగా దించేశారు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళా రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తాము కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులమేనని, రాజమండ్రి వెళ్లేందుకు తమకు ప్రత్యేకంగా అనుమతి ఎందుకని పోలీసులను నిలదీశారు. ఏదేమైనా సరే రాజమండ్రికి వెళతామని, చంద్రబాబు కుటుంబాన్ని కలిసి తీరతామని స్పష్టం చేశారు. దీంతో టోల్ గేట్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది.



More Telugu News