చంద్రబాబు దోషిగా తేలితే ఆరేళ్లు ఎన్నికలకు దూరం: విజయసాయిరెడ్డి

  • విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి
  • నిర్దోషిగా తేలితే బయటకు వస్తారన్న వైసీపీ నేత
  • లేదంటే ఎమ్మెల్యే పదవికి అనర్హులు అవుతారంటూ ‘ఎక్స్’లో పోస్ట్ 
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం ఆరోపణలతో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందని, సాక్ష్యాధారాలు ఉండబట్టే నిందితుడు అరెస్ట్ అయ్యాడని పేర్కొన్నారు. విచారణకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.  చంద్రబాబు కేసు ప్రస్తుతం కోర్టులో ఉందని పేర్కొన్నారు. కోర్టు కనుక నిర్ణయిస్తే ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని తెలిపారు. ఒకవేళ ఈ కేసులో ఆయన దోషిగా తేలితే మాత్రం ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా మారుతారని, వచ్చే ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిందేనంటూ ఎక్స్ చేశారు. 

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. నిన్న గాంధీ జయంతిని పురస్కరించుకుని జైలులో చంద్రబాబు, రాజమహేంద్రవరంలో ఆయన భార్య భువనేశ్వరి, ఢిల్లీలో లోకేశ్ సహా పలువురు నేతలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. మరోవైపు, ఇన్నర్ రింగురోడ్డు కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబు చేసుకున్న బెయిల్ దరఖాస్తుపై నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఇదే కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ రేపు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు.


More Telugu News