ట్రంకుపెట్టెలో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు.. మిస్టరీ వీడింది!

  • కటిక పేదరికానికి తోడు ఐదుగురు సంతానం
  • పిల్లల్ని పెంచలేక ముగ్గురు కుమార్తెలకు పాలల్లో విషం కలిపి తాగించి హత్య
  • ఆపై అదృశ్యమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు
  • నిజమైన పోలీసుల అనుమానం
ఓ వైపు కటిక పేదరికం.. మరోవైపు ఐదుగురు సంతానం. భార్యాభర్తలు ఇద్దరూ కూలిపనులు చేస్తున్నా కుటుంబం గడవడం కష్టంగా మారింది. పిల్లల పోషణ భారమైంది. ఇక తమ వల్ల కాదని భావించిన ఆ దంపతులు ముగ్గురు కుమార్తెలకు పాలల్లో విషం కలిపి తాగించి చంపేశారు. మృతదేహాలను ట్రంకు పెట్టెలో కుక్కేశారు. ఆపై వారు అదృశ్యమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో ఓ వలస కుటుంబం ఇంట్లోని ట్రంకుపెట్టలో కనిపించిన ముగ్గురు చిన్నారుల మృతదేహాల మిస్టరీ వీడింది. స్వయంగా తల్లే వారిని చంపేసి పెట్టెలో కుక్కేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. చిన్నారుల తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తమ ముగ్గురు కుమార్తెలు అమృత (9), సాక్షి(7), కంచన్ (4) ఈ ఉదయం నుంచి కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వీధిలో ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు ఆదివారం రాత్రి 11 గంటలు దాటినా తిరిగి రాలేదని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులను కలిసి పిల్లల గురించి ఆరా తీశారు. ఆ పిల్లలు ఎవరూ ఆడుకోవడానికి బయటకు రాలేదని, ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నారని చెప్పడంతో పోలీసులు అనుమానించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినా కనిపించకపోవడంతో అనుమానం మరింత బలపడింది.

దీంతో వారింటికి చేరుకున్న పోలీసులు అణువణువు గాలించారు. ఈ క్రమంలో ఓ ట్రంకు పెట్టెలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. నిందితులైన వారి తల్లిదండ్రులు సుశీల్ మండల్, మీనును అరెస్ట్ చేశారు. దినసరి కూలీలైన వారు పిల్లల్ని పెంచలేకే చంపేసినట్టు విచారణలో అంగీకరించారు. పాలల్లో విషం కలిపి ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పారు. 

తమకు ముగ్గురు అమ్మాయిలు సహా ఐదుగురు సంతానమని వారు తెలిపారు. ఘటన జరిగిన రోజు రెండేళ్ల కొడుకు, ఏడాదిన్నర వయసున్న కుమార్తెను తమతోపాటు పని వద్దకు తీసుకెళ్లినట్టు చెప్పారు. విచారణ జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


More Telugu News