ఈశాన్య భారతాన్ని వణికించిన వరుస భూకంపాలు…ఒకే రోజు మూడు ప్రాంతాల్లో ప్రకంపనలు

  • సోమవారం అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌లో వరుస భూకంపాలు
  • వరుస భూప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన
  • భూకంపాలతో కొండచరియలు విరిగి పడే అవకాశం
  • జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు అధికారుల సూచన
సోమవారం వరుస భూకంపాలు ఈశాన్య రాష్ట్రాలను వణికించాయి. పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. అస్సాంలో రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. గువాహటీకి పశ్చిమాన 116 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

మేఘాలయలో సోమవారం సాయంత్రం 6.15 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై 5.2 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఉత్తర గారో కొండల్లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్‌లోనూ భూమి స్వల్పస్థాయిలో కంపించింది. కాగా, భూకంపాలకు కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు. 

భారత్‌తో పాటు, భూటాన్, ఉత్తర బంగ్లాదేశ్ అంతటా భూమి కంపించింది. భౌగోళికంగా భూకంపాలు తరచూ సంభవించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాలు ఉన్న విషయం తెలిసిందే.


More Telugu News