104 ఏళ్ల వయసులో విమానం నుంచి కిందకు దూకిన బామ్మ! గిన్నిస్ రికార్డుకు యత్నం

  • అమెరికా మహిళ డొరొతీ సాహసం
  • ఇన్‌స్ట్రక్టర్ సాయంతో 4100 మీటర్ల ఎత్తు నుంచి స్కైడైవింగ్
  • అత్యధిక వయసున్న స్కైడైవర్‌గా గిన్నిస్ రికార్డు నెలకొల్పడమే తన లక్ష్యమని మహిళ వెల్లడి
ప్రపంచరికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా వృద్ధురాలు డొరొతీ హాఫ్‌మన్ 104 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేశారు. నిపుణుడైన మరో స్కైడైవర్‌తో కలిసి ఆమె విమానం 4,100 మీటర్ల ఎత్తున ఉండగా టాండమ్ జంప్‌ చేశారు. షికాగోలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దిగ్విజయంగా స్కైడైవ్ పూర్తి చేసిన అనంతరం డొరొతీ చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న వారికి అభివాదం చేశారు. వయసంటే కేవలం ఓ సంఖ్య మాత్రమేనని, దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని డొరొతీ చెప్పుకొచ్చారు. 
 
షికాగోకు చెందిన డొరొతీ 100 ఏళ్ల వయసులో తొలిసారిగా స్కైడైవింగ్‌కు ప్రయత్నించారు. అప్పట్లో విమానం నుంచి కిందకు దూకేందుకు ఆమె సంకోచించడంతో వెనకున్న ఇన్‌స్ట్రక్టర్ ఆమెకు ధైర్యం చెప్పి ముందుకు తోయాల్సి వచ్చింది. కానీ ఆదివారం ఆమె అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ చొరవతో తనే ముందడుగు వేశారు. తన వాకర్‌ను పక్కన పెట్టి విమానం డోరు వైపు నడిచారు. తలుపు తెరుచుకోగానే ఆమె.. నిపుణుడైన స్కైడైవర్‌తో కలిసి (టాండమ్ జంప్) కిందకు దూకారు. ఆ తరువాత కొన్ని నిమిషాలకు అక్కడి పొలాల్లో దిగారు. మొత్తం ఏడు నిమిషాల్లో ఇదంతా పూర్తయ్యింది.  

స్కైడైవింగ్ చేసిన అత్యంత పెద్దవయసు వ్యక్తిగా ఈ ఫీట్‌తో తనకు రికార్డు దక్కుతుందని డొరొతీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రికార్డు స్వీడెన్‌కు చెందిన లినేయా లార్సన్ పేరిట ఉంది. 2022 మేలో ఆమె 103 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 


More Telugu News