హైడ్రామా నడుమ టీడీపీ నేత బండారు సత్యనారాయణ అరెస్ట్

  • ఏపీ సీఎం జగన్, మంత్రి రోజా పట్ల వ్యాఖ్యలు చేసినట్టు బండారుపై ఆరోపణలు
  • రెండు కేసుల నమోదు
  • గత అర్ధరాత్రి బండారు నివాసం వద్దకు పోలీసులు
  • ఈ సాయంత్రం వరకు కొనసాగిన ఉద్రిక్తత
ఏపీ సీఎం జగన్ పైనా, మంత్రి రోజాపైనా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో గత అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగింది. 

మంత్రి రోజా పట్ల వ్యాఖ్యలు చేసిన బండారుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు నిన్న అర్ధరాత్రి వెన్నెలపాలెంలో బండారు నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే, టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సాయంత్రం వరకు ఉద్రిక్తతలు కొనసాగాయి.

బండారు సత్యనారాయణకు నోటీసులు (41ఏ, 41బీ) ఇచ్చేందుకు పోలీసులు గేటు దూకి ఇంట్లోకి వెళ్లడంతో తెలుగు మహిళలు భగ్గుమన్నారు. బండారు తన గదిలో తలుపు గడియ పెట్టుకోగా, పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బండారుకు నోటీసులు అందించిన పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ్నించి మంగళగిరి తరలిస్తారని తెలుస్తోంది. 

బండారు సత్యనారాయణపై రెండు కేసులు నమోదు చేసినట్టు సమాచారం. సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఒక కేసు, మంత్రి రోజాపై వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదయ్యాయి.


More Telugu News