బెంగళూరులో కారు పూలింగ్ పై నిషేధం.. ఉపసంహరణకు బీజేపీ డిమాండ్

  • బెంగళూరు జనాభా అవసరాలకు తగ్గ బస్సులు లేవన్న బీజేపీ ఎంపీ సూర్య
  • రైడ్ షేరింగ్, కారు పూలింగ్ తక్షణ పరిష్కారమని సూచన
  • ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు అనుమతించాలని వినతి
కర్ణాటక సర్కారు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారు పూలింగ్ ను నిషేధించింది. ఉల్లంఘన దారులకు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా విధిస్తామంటూ గత శనివారం ఆదేశాలు తీసుకొచ్చింది. ఒక వాహనాన్ని సొంత అవసరాల కోసం వినియోగిస్తే దానికి పన్ను చాలా తక్కువగా ఉంటుంది. అదే రవాణాకు వినియోగిస్తే ప్రత్యేక పన్ను కట్టాల్సి ఉంటుంది. సొంత అవసరాల కోసం ఉద్దేశించిన వైట్ బోర్డు కార్లను వాణిజ్య అవసరాలకు (షేరింగ్/పూలింగ్) ఉపయోగిస్తున్నట్టు తెలుసుకున్న కర్ణాటక సర్కారు దీన్ని నిషేధించింది.

దీనిపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి లేఖ రాశారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా కారు పూలింగ్ కు అనుమతించాలని కోరారు. బెంగళూరులో ప్రస్తుతం ఉన్న ప్రజా రవాణా సదుపాయాలు చాలడం లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. రహదారులపై వాహనాల సంఖ్యను తగ్గించేందుకు కారు పూలింగ్ ఒక పరిష్కారమని పేర్కొన్నారు. 

‘‘పట్టణలో ప్రజా రవాణాను పరిశీలిస్తే బీఎంటీసీ గత కొన్ని సంవత్సరాలుగా 4,500 బస్సులను తిప్పుతోంది. వాటి సంఖ్య ఇప్పుడు 6,763కు పెరిగింది. బెంగళూరులో 1.10 కోట్ల ప్రజా అవసరాలను తీర్చేందుకు ఇవి సరిపోవు. మరో 6,000 బస్సులు కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైడ్ షేరింగ్, కార్ పూలింగ్ తక్షణ పరిష్కారం అవుతుంది. ఒకే ఐటీ పార్క్ కు వెళ్లే ఉద్యోగులకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది’’ అని తేజస్వి సూర్య పేర్కొన్నారు.


More Telugu News