స్టాన్‌ఫోర్డ్‌లో చేరడానికి నేను రాసిన వ్యాసం ఇదే.. బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడం ఆమె ఇష్టం: లోకేశ్

  • చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న లోకేశ్
  • రాజకీయాల్లోకి రావాలని తనకెవరూ చెప్పలేదన్న యువనేత
  • చదువుకున్న వాళ్లు, సామాజిక స్పృహ ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండకూడదన్న లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అమెరికాలో తాను స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చేరడానికి ముందు ఓ వ్యాసం రాయాల్సి వచ్చిందని, దీంతో రాజకీయాల్లో సానుకూల నాయకత్వం తీసుకురావాలనుకుంటున్నానని రాశానని గుర్తు చేసుకున్నారు. నిజాయతీపరులకు శిక్ష పడితే చదువుకున్నవాళ్లు, సామాజిక స్పృహ ఉన్నవాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ లోకేశ్ స్టాన్‌ఫోర్డ్‌ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 

తెలుగుదేశం పార్టీ ఏనుగులాంటిదని పేర్కొన్న లోకేశ్.. సిద్ధం కావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అది పరిగెత్తడం మొదలుపెడితే ఆపడం ఇక ఎవరి తరమూ కాదని, అడ్డొచ్చిన వారిని తొక్కుకుని ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని అన్నారు. చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదని, అలాంటి వ్యవస్థను మార్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తాను, బ్రాహ్మణి ఇద్దరం స్టాన్‌ఫోర్డ్‌లోనే ఎంబీయే చేశామని, రాజకీయాల్లోకి రావాలని తనకు ఎవరూ చెప్పలేదని, తనంత తానుగానే వచ్చానని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అనేది బ్రాహ్మణి ఇష్టమని లోకేశ్ స్పష్టం చేశారు.


More Telugu News