అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. జిల్లాలో కలకలం

  • వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • ఆయన నివాసానికి వెళ్లే మార్గంలో పలు చోట్ల బందోబస్తు
  • విషయం తెలిసి బండారు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు
  • పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు
  • అర్ధరాత్రి ఎందుకొచ్చారంటూ పోలీసులపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద ఆదివారం అకస్మాత్తుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అర్ధరాత్రి దాటాక మాజీ మంత్రి నివాసం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడంతో స్థానికంగా కలకలం రేగింది. బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాలు సెంటర్, విద్యుత్ సబ్ స్టేషన్ సెంటర్, వెన్నెలపాలెం ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఇతరులెవ్వరూ రాకుండా అడ్డుకున్నారు. ఈ పరిణామంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్ధరాత్రి పోలీసులు రావాల్సిన అవసరం ఏంటని స్థానిక నేతలు ప్రశ్నించారు. 

ఇటీవల మంత్రి రోజాపై బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరవాడ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్సీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు బండారు ఇంటికి తరలివెళ్లారు. పరిసర గ్రామాలకు చెందిన మహిళలు కూడా వెళ్లారు. వారిని పోలీసుల ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.


More Telugu News