ఢిల్లీలో రేపు లోకేశ్ ఒక రోజు నిరాహార దీక్ష

  • గాంధీ జయంతి సందర్భంగా జైలులో చంద్రబాబు, రాజమహేంద్రవరంలో భువనేశ్వరి నిరసన దీక్ష
  • సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపట్టాలని అచ్చెన్నాయుడి పిలుపు
  • రేపు సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాలపాటు లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రేపు (అక్టోబర్ 2) ఢిల్లీలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా ఈ దీక్ష తలపెట్టారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా తనను అరెస్ట్ చేసి జైలులో పెట్టారని వాదిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గాంధీ జయంతిని పురస్కరించుకుని రేపు ఆయన ఉంటున్న రాజమహేంద్రవరం జైలు గదిలోనే దీక్ష చేపట్టనున్నారు. మరోవైపు ఆయన భార్య భువనేశ్వరి కూడా రాజమహేంద్రవరంలో దీక్ష చేస్తారు. దీంతో వారికి మద్దతుగా ఢిల్లీలో దీక్ష చేయాలని లోకేశ్ నిర్ణయించారు.  

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అరెస్టును నిరసిస్తూ గాంధీ జయంతి రోజున జైలులోనే నిరసన దీక్ష చేపట్టాలని చంద్రబాబును కోరామని, అందుకు ఆయన ఓకే అన్నారని తెలిపారు. భువనేశ్వరి కూడా రేపు రాజమహేంద్రవరంలో దీక్షలో కూర్చుంటారని వివరించారు. వీరికి సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు. అలాగే, రేపు సాయత్రం 7 గంటలకు ఐదు నిమిషాలపాటు ఇంట్లోని లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన చేపట్టబోతున్నట్టు అచ్చెన్న తెలిపారు.


More Telugu News