గాంధీ జయంతి నాడు జైల్లోనే చంద్రబాబు నిరసన దీక్ష

  • తన అరెస్టును నిరసిస్తూ టీడీపీ అధినేత దీక్ష
  • ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్ష నిర్వహించేందుకు బాబు నిర్ణయం
  • చంద్రబాబు దీక్షకు మద్దతుగా సోమవారం పార్టీ నేతలుందరూ నిరసన దీక్షలు చేపట్టనున్న వైనం
  • శనివారం మీడియా సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన
స్కిల్ డెవలప్మెంట్‌ కేసులో తన అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి నాడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ఆయన నిరసన చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన తెలియజేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. 

పార్టీ అధినేత నిరసన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం దీక్షలు చేపడతారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘సైకో జగన్‌కు వినిపించేలా మోత మోగిద్దాం’ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, చంద్రబాబు అర్థాంగి నారా భువనేశ్వరి కూడా అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.


More Telugu News