నాపై పిన్నులు విసిరితే... అవి గుచ్చుకుంటే వచ్చే రక్తంతో నా చరిత్ర రాస్తా: గవర్నర్ తమిళిసై

  • హైదరాబాదులో ఓ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళిసై
  • ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టించుకోబోనని ఉద్ఘాటన
  • తనపై పూలు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వాళ్లు కూడా ఉన్నారని వ్యాఖ్యలు
  • తనకు తెలిసిందల్లా పోరాటం, ప్రజాసేవ మాత్రమేనని వెల్లడి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా పట్టించుకోనని, తానున్నది ప్రజల కోసమేనని, ప్రజల కోసమే పనిచేస్తానని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ అందరికీ నచ్చాలని లేదని అన్నారు. 

తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు విసిరేవాళ్లు కూడా ఉన్నారని తెలిపారు. తనపై రాళ్లు విసిరితే ఆ రాళ్లతో భవంతి నిర్మించుకుంటానని, తనపై పిన్నులు విసిరితే ఆ పిన్నులు గుచ్చుకుని వచ్చే రక్తంతో తన చరిత్రను రాసుకుంటానని వ్యాఖ్యానించారు. తాను వెళ్లే మార్గంలో ముళ్లు ఉంచితే, వాటిని తొలగించుకుని వెళతానని అన్నారు. తనకు తెలిసిందల్లా పోరాటం, ప్రజాసేవ అని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. 

తాను ఇక్కడికి గవర్నర్ గా వచ్చేంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, తాను ఉదయం గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించాక, అదే రోజు సాయంత్రానికి ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించానని వెల్లడించారు. 

ప్రోటోకాల్ ఇచ్చినా, ప్రోటోకాల్ ఇవ్వకపోయినా... చేయాల్సిన పనిచేయడమే ముఖ్యమని తమిళిసై పేర్కొన్నారు. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News