ఆసియా క్రీడల్లో భారత్ పసిడి జోరు.. స్క్వాష్ ఈవెంట్లోనూ స్వర్ణం

  • ఆసియా క్రీడల్లో భారత్ కు 10వ స్వర్ణం
  • పురుషుల స్క్వాష్ ఈవెంట్ ఫైనల్లో పాకిస్థాన్ ను ఓడించిన భారత్
  • బెస్టాఫ్ త్రీ ఫైనల్లో 2-1తో భారత్ జయభేరి
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో ఇవాళ మరో పసిడి పతకం చేరింది. ఇప్పటికే టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ స్వర్ణం సాధించడంతో భారత శిబిరంలో ఉత్సాహం నెలకొని ఉండగా, తాజాగా స్క్వాష్ ఈవెంట్లోనూ స్వర్ణం లభించింది. అది కూడా పాకిస్థాన్ ను ఓడించి ఈ పతకం నెగ్గడంతో భారత బృందంలో సంతోషం రెట్టింపైంది. 

ఇవాళ జరిగిన పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్ బెస్టాఫ్ త్రీ ఫైనల్ పోటీలో భారత్ 2-1తో పాక్ ను ఓడించింది. తొలి ఫైనల్లో ఎం.మహేశ్ 8-11, 3-11, 2-11తో పాక్ ఆటగాడు నాసిర్ ఇక్బాల్ చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే, సౌరవ్ ఘోషాల్ 11-5, 11-1, 11-3తో మహ్మద్ ఆసిమ్ పై నెగ్గి భారత అవకాశాలను సజీవంగా నిలిపాడు. 

ఇక కీలకమైన మూడో ఫైనల్లో అభయ్ సింగ్ 11-7, 9-11, 7-11, 11-9, 12-10తో నూర్ జమాన్ పై నెగ్గి భారత్ కు స్వర్ణం అందించాడు. కాగా, హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో ఇది భారత్ కు 10వ స్వర్ణం. ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య 36కి పెరిగింది.


More Telugu News