తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న వ్యక్తికి ఇక్కడేం పని?: శ్రీనివాస్ గౌడ్
- ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన శ్రీనివాస్ గౌడ్
- ఏ మొహం పెట్టుకుని పాలమూరుకు వస్తున్నారంటూ మండిపాటు
- మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వస్తున్నారా? అని ప్రశ్న
తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న వారు మహబూబ్ నగర్ కు వస్తున్నారని ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాష్ట్రంపై విషం చిమ్మేవాళ్లు ఇక్కడకు వచ్చి చేసేదేముందని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని పాలమూరుకు వస్తున్నారని మండిపడ్డారు. మహమూబ్ నగర్ జిల్లాకు ఏం చేయబోతున్నారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రశాంతంగా ఉన్న పాలమూరును మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి అల్లకల్లోలం చేసేందుకు మోదీ వస్తున్నారా అని ప్రశ్నించారు. ఇకపై ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వబోమని పార్లమెంటు సాక్షిగా చెప్పిన బీజేపీ... కర్ణాటకలోని అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చిందని మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిన ఘనత బీఆర్ఎస్ దని... ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత బీజేపీదని చెప్పారు. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం... తెలంగాణకు ఒక్క కాలేజీని కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు.
తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడేం పని అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అడ్డదారుల్లో పాగా వేయాలని చూస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.